మహిళలకు హెల్త్ ప్రొఫైల్..ఉన్నతాధికారుల సమీక్షలో మంత్రి సీతక్క

మహిళలకు హెల్త్ ప్రొఫైల్..ఉన్నతాధికారుల సమీక్షలో మంత్రి సీతక్క

హైదరాబాద్, వెలుగు: మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులందరికీ సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించి హెల్త్ ప్రొఫైల్స్ సిద్ధం చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు. మహిళల సాధికారత కోసం పలు పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ఆమోదంతో త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. సోమవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.  షీ టీమ్స్, భరోసా కేంద్రాలు, సైబర్ క్రైమ్, విద్యాసంస్థలు, హాస్టళ్లు, కార్యాలయాలు, రాత్రివేళల ప్రయాణాలు తదితర అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ప్రైవేటు రంగంలో పని చేస్తున్న మహిళలకు మెటర్నిటీ బెనిఫిట్స్ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆశ్రయ గృహాలు, హాస్టళ్ల భద్రతపై డిజిటల్ పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. విద్యాసంస్థలు, కార్పొరేట్ సంస్థలు, కంపెనీల్లోని అంతర్గత ఫిర్యాదు కమిటీల (ఐసీసీ) పనితీరుపై తప్పనిసరి ఆడిట్ వ్యవస్థను అమలు చేయాలని సూచించారు. రాత్రి 8 గంటల తర్వాత మహిళా ఉద్యోగులకు జీపీఎస్ అనుసంధానిత రవాణా సదుపాయం కల్పించాలని చెప్పారు.

అసంఘటిత రంగ మహిళల కోసం ప్రత్యేక నమోదు విధానం, గుర్తింపు కార్డులు, ప్రత్యేక ఫిర్యాదు వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రజా రవాణాలో సీసీటీవీ పర్యవేక్షణను బలోపేతం చేసి, పీక్ అవర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భద్రతా ఆడిట్లు నిర్వహించాలని సూచించారు. 

వృద్ధులు, దివ్యాంగ మహిళలకు ప్రత్యేక విధానాలు.. 

వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగ మహిళల రక్షణకు ప్రత్యేక విధానాలు రూపొందించాలని మంత్రి సూచించారు. గృహ హింస కారణంగా ఒంటరిగా మిగిలిన మహిళలకు ప్రభుత్వ ఆధ్వర్యంలో రుణాలు అందించి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో సంజయ్ కుమార్, షికా గోయల్, క్రిస్టినా చోంగ్తు, అనితా రామచంద్రన్, దివ్యా దేవరాజన్, శృతి ఓజా, ప్రియాంకా వర్గీస్ తదితరులు పాల్గొన్నారు.